ఇదేనా ఇందిరమ్మ రాజ్యం

0
87

అక్షరం తో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేస్తారా?
సీఎం రేవంత్ రెడ్డి ని సాయిరాం రెడ్డి కలిశాకే జర్నలిస్ట్‌ శంకర్‌పై దాడి
మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, క్రాంతికిరణ్‌


ప్రజానావ, హైదరాబాద్‌ బ్యూరో: ‘రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లు, కూల్చివేతలు, దాడులు.

ప్రశ్నించే గొంతుకల పై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శంకర్ పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ధి జీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలి.

అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, క్రాంతికిరణ్‌ డిమాండ్‌ చేశారు.

శనివారం వారు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఆంజనేయ గౌడ్, పల్లె రవికుమార్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్ అనే జర్నలిస్టుల మీద కూడా వేధింపులతో పాటు దాడులు జరిగాయని పేర్కొన్నారు.

జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త సాయిరాం రెడ్డి అని సీసీ టీవీ ఫుటేజీ లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాయిరాం రెడ్డి కలిశాకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. శంకర్ పై దాడికి ముందే సాయిరాం రెడ్డి రెక్కి నిర్వహించాడని, సాయిరాం రెడ్డి హస్తినపురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అనుచరుడని వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలన మూడు నెలలు కాకముందే అనేక ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో సీఎం రేవంత్ ముందే భక్తుల పై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు.

ఇప్పటిదాకా 2600 మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. ఇసుక, ల్యాండ్ మాఫియా చేల రేగుతోందన్నారు.

విసునూరు రామచంద్ర రెడ్డి, ఎర్ర పహాడ్ ప్రతాప్ రెడ్డి వంటి దేశ్ ముఖ్ లలో దళిత బహుజనులు ఎలాంటి దాష్టీకాలు ఎదుర్కుంటున్నారో ఇపుడు నయా దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో అవే దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

నయా దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో దళిత బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు.

మా వాళ్లు ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టల్లో..


కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తే పోలీసులు చెత్తబుట్టలో వేస్తున్నారని, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.. ఇది పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు.

బీఆర్ఎస్‌కు అనుకూలంగా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు ఏ పోస్టులు పెట్టినా చెల్లుతుందా? నయా దేశముఖ్ రేవంత్ 20 ,30 యేండ్లు అధికారంలో ఉంటారని పోలీసులు అనుకుంటున్నారా?

రేవంత్‌కు మీడియా పట్ల ఎలాంటి చులకన భావం తో ఉండేవారో ఆయన పాత వీడియోలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి పాశవిక హింసాత్మక ధోరణి ని రేవంత్ ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

రేవంత్‌ది తెలంగాణ మీద ప్రతీకార పాలన


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిది ప్రజా పాలన కాదని, తెలంగాణ మీద ప్రతీకార పాలన అని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు.

తెలంగాణ త్యాగాలతో వచ్చిందని, ఆ త్యాగాలు రేవంత్ కు తెలియవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిపై రేవంత్ కక్ష కట్టారని, తన నియోజక వర్గం లో బీఆర్ఎస్ కార్యకర్తల పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉల్టా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఎమర్జెన్సీ చీకటి రోజులను కాంగ్రెస్ పాలన తలపింపజేస్తోందన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యల పైనే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

సిద్దిపేట జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ కార్యకర్త చంపుతానని బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని,

మేధావులు ఈ అరాచక విధానాలపై స్పందించాలన్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ హయంలో ఇలాంటివి జరగలేదన్నారు.

కాంగ్రెస్ పాలన అంటే బూతులు దాడులు కేసులుగా మారిందని విమర్శించారు. అభివృద్ధి పై ధ్యాస లేదని, కాంగ్రెస్‌ నేతలు వెంటనే బీఆర్ఎస్ పై ఆరాచకాలను ఆపాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here