రెండో టెస్టూ మనదే

0
36
  • రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌
  • విన్నింగ్‌ షాట్‌తో జట్టును గెలిచిపించిన పుజారా
  • 7 వికెట్లతో రాణించిన రవీంద్ర జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 61 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన కంగారూలను భారత స్పిన్నర్లు ఓ ఆట ఆడుకున్నారు. వరుస వికెట్ల తీస్తూ 115 పరుగులకే పరిమితం చేశారు. ఆసీస్‌ బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ (43), లబుషేన్‌ (35) మినహా మరెవరూ రెండంకెల స్కోరును చేయలేదు. భారత బౌలర్లలో రవీంద్రజడేజా 7 వికెట్లతో చెలరేగగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (1) లియాన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా, అప్పటివరకు మంచి ఫాంలో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31) అనవసర పరుగుకు యత్నంచి రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి (20) మర్ఫీ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. చతేశ్వర్‌ పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌ (12)తో కలిసి కొద్దిసేపు స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించగా, లియాన్‌ బౌలింగ్‌ శ్రేయస్‌ క్యాచ్‌ అవుట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక చివర్లో ఆంధ్రా కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (23, నాటౌట్‌)తో కలిసి చతేశ్వర్‌ పుజారా (31, నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు. 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న పుజారా తొలి ఇన్నింగ్స్‌లో (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ్గా, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విన్నింగ్‌ షాట్‌ (ఫోర్‌) కొట్టి మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ మార్చి 1న ఇండోర్‌ వేదికగా జరగనుంది.
సచిన్‌ రికార్డు బద్దలుకొట్టిన విరాట్‌
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 549 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించగా, అంతకుముందు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ 577 ఇన్నింగ్స్‌ల్లో 25వేల పరుగులు పూర్తి చేశాడు. ఇదిలాఉంటే ఆల్‌రౌండర్‌ రవీంద్రజడేజా సైతం ఒకే మ్యాచ్‌లో ఐదుగురిని బౌల్డ్‌ చేసి 31 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాడు. 1992లో టీమిండియా మాజీ ఆటగాడు అనిల్‌ కుంబ్లే జోహానెస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here