తొలి టెస్టు మనదే..

0
4

– రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలిన కరేబియన్‌ జట్టు
– విండీస్‌పై టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల భారీ విజయం
– యశస్వీ జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

డొమినికా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 245/2తో మూడోరోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ను 421/5 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (171) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లీ (76) కెరీర్‌లో 29వ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లలో అజింక్యా రహానె (3), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (37 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (1 నాటౌట్‌) పరుగులు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికే భారత్‌ 271 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇలా వచ్చి అలా వెళ్లారు!

అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్‌ జట్టు 50.3 ఓవర్లలోనే 130 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్‌ బ్యాటర్లలో అలిక్‌ అథనాజే (28)దే అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర్లలో అశ్విన్‌ 7 వికెట్లు తీసుకోగా, జడేజా 2, సిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్‌కు దక్కింది. ఇరుజట్ల మధ్య ఈ నెల 24 నుంచి రెండో టెస్టు జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here