కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

0
17

• డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణలో డబుల్ అభివృద్ధి
• 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు
• ఈనెల 30 నుంచి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్
• ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు?
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

ప్రజానావ/హైదరాబాద్‌ బ్యూరో: తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు.

అట్లాగే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు ‘మహా జన సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన ప్రయోజనాలను వివరించారు. హైదరాబాద్ లోని చంపాపేటలో సోమవారం బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, డా. లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,

తెలంగాణ రాష్ట్ర సహ ఇన్‌చార్జి అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం తథ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

విశ్వగురు స్థానానికి భారత్‌
దేశంతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నా, కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వంతో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారత్ విశ్వగురు స్థానానికి ఎదుగుతోందని, పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ పేదల కష్టాలను గుర్తించి వారి జీవితాల్లో మార్పుతోనే దేశ ప్రగతి సాధ్యమనే ఉద్దేశంతో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

గుజరాత్ లో రాత్రిపూట బయటకు వస్తే మహిళలు చెంబు పట్టుకుని బహిర్భుమికి వెళుతున్న దృశ్యాన్ని చూసిన మోదీ.. స్వచ్ఛ భారత్ పేరుతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. పేదలు తలదాచుకునేందుకు ఇండ్ల నిర్మాణం, ఉచిత రేషన్ బియ్యం, జాతీయ ఉపాధి హామీ పథకంతో 100 రోజుల పని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటి నుంచి బయట అడుగు పెడితే గ్రామాల్లోని రోడ్లన్నీ కేంద్రం నిర్మించినవేనని, రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు సహా పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే జరుగుతోందన్నారు.

కరోనా కాలంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు
కొవిడ్ తో ప్రపంచమంతా అల్లాడుతుంటే లాక్ డౌన్ విధించడమే కాకుండా, 200 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ప్రజల ప్రాణాలను కాపాడిన వ్యక్తి మోదీ అన్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదేనని కొనియాడారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ శక్తిగా తీర్చిదిద్దేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.

గ్రామీణ సదుపాయాల కోసం గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కోసం 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. కొత్త రైల్వే, డబ్లింగ్ పనులుసహా వివిధ ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ ద్వారా తెలంగాణకు 35 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి 1 లక్షా 10 వేల కోట్లను ఖర్చు చేశారు. ఇయాళ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలుసహా ప్రతి ఒక్కరూ రయ్ రయ్ మంటూ వెళుతున్నారంటే అది మోదీగారి చలవేనన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కారుంటే ఇంకా మేలు జరిగేది
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎక్కువ లాభం జరిగేదని, కేంద్ర ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ బీమా పథకాన్ని ఇక్కడ అమలు చేయడం లేదన్నారు. అది అమలైతే ప్రతి పేదవాడు రోగమొస్తే 5 లక్షల వరకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే వీలుండేదన్నారు. గత నాలుగేళ్లుగా ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సాయం అందడం లేదు.

ఒకవేళ ఈ పథకం అమలైతే దాదాపు 30 వేల కోట్లకుపైగా రైతులకు సాయం అందేది. దేశంలోని ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో మోదీగారి ప్రభుత్వం 3 కోట్ల ఇండ్లను కట్టిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుంటే ఇయాళ తెలంగాణలో నిలువ నీడలేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరయ్యేది. స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, మహిళలకు ముద్రా రుణాల కింద పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందేది.

యూపీలో యోగి సర్కార్ కేంద్ర సాయంతో 30 లక్షలకు పైగా ఇండ్లు కట్టించారు. ముద్ర రుణాల ద్వారా 75 లక్షల మందికి రుణాలిచ్చారు. యూపీలోని యోగి ప్రభుత్వం జల్ శక్తి మిషన్ కింద 16 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇంటింటికి మంచి నీళ్లు అందిస్తే… అందులో నాలుగో వంతు జనాభా ఉన్న తెలంగాణలో మాత్రం మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తక్కువ ఖర్చుతో కమీషన్లకు తావు లేకాం అందరికీ నీళ్లు ఇచ్చేవాళ్లం.

విశ్వాస ఘాతకుడు కేసీఆర్
‘కేసీఆర్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నడు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడు. కేసీఆర్ లాంటి నీచుడిని, విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు.. కేసీఆర్ ఎంతటి విశ్వాసఘాతకుడంటే మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ను మోసం చేసిండు..

తెలంగాణ కోసం మొదటి నుండి నిలబడి కలబడి పార్లమెంట్ బిల్లు పాస్ చేయించిన సుష్మా స్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించిన నీచుడు… 2004లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఆ పార్టీని, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బయటకొచ్చి ఆ పార్టీని మోసం చేసిండు… 2004లో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిన నోరే… ఇయాళ తన అవసరం కోసం కమ్యూనిస్టు పార్టీలను చంకనేసుకుని తిరుగుతున్నడు..

దేశాన్ని కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం మోసం చేస్తే అవసరం తీరాక ఆ కాంగ్రెస్ ను, ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్… అంతెందుకు కర్నాటక ఎన్నికల దాకా జేడీఎస్ కు నిధులు పంపి జట్టు కట్టిన కేసీఆర్… ఆ వెంటనే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ తో జత కట్టిన నీచుడు.. తెలంగాణ కోసం బొంత పురుగునైనా కౌగిలించుకుంటానన్న కేసీఆర్ అసలు నైజం అది కాదు… తన స్వార్ధం కోసం, తన కుటుంబం ప్రయోజాల కోసం బొంత పురుగునైనా నమిలి మింగేసే రకం కేసీఆర్’ అని విమర్శించారు.

బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు దుష్ట చతుష్ట పార్టీల కుట్ర
ప్రశ్నిస్తున్నది బీజేపీ… ప్రజల పక్షాన పోరాడుతున్నది బీజేపీ… లాఠీలకు భయపడకుండా కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ. జైళ్లకు పోతున్నది బీజేపీ. ప్రజలంతా ఇయాళ కేసీఆర్ ను ఢీ కొట్టేది బీజేపీయేనని భావనతో ఉన్నారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘2018 నుండి బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. అందుకే గత మూడేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే… జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీవైపు నిలిచారు.

ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లే రాని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయమవుతోందో ఆలోచించాలి. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు నాలుగు దిక్కులు చూస్తూ నాలుగు స్థంభాలాట ఆడుతుంటే… ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నరని ఎద్దేవా చేశారు.

కర్నాటక ఫలితాలతో లింకేంటి?
ఎట్లయినా బీజేపీని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, ఒక సెక్షన్ మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణలో బీజేపీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నయ్. మీడియాలోని ఓ సెక్షన్ వీరికి వంతపాడుతూ బీజేపీలో చేరిన లీడర్లంతా కాంగ్రెస్ లోకి పోతున్నరని కథనాలు మొదలు పెట్టినయని మండిపడ్డారు.

కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? అక్కడ ఓడిపోతే ఇక్కడెందుకు బీజేపీ బలహీనపడుతుందో మీడియా యాజమాన్యాలు, విజ్ఞులైన రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఆలోచించాలన్నారు. శాసనసభ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఢిల్లీ నుంచి గల్లీలో లేని కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచాలని చూస్తే ప్రజా విశ్వాసం కోల్పోక తప్పదన్నారు.

సింగిల్‌గానే బీజేపీ పోటీ
కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నడని, ఆ పార్టీకి సొంతంగా అధికారం రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పాకెట్ మనీ పేరుతో ఎన్నికల ఫండింగ్ చేస్తున్నడని విమర్శించారు. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. మెజారిటీ సాధిస్తుందని, అందులో అనుమానమే లేదని స్పష్టం చేశారు. సినిమాల్లో గుర్తుండిపోయిన విలన్లు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య.. రాష్ట్రంలో కేసీఆర్ మెయిన్ విలన్ రావుగోపాలరావు

అయితే కాంగ్రెస్, ఎంఐంఎం పార్టీలు సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ వంటి విలన్లు. కమ్యూనిస్టులు ఆకు రౌడీల టైపు….. వీళ్లంతా కలిసి హీరోలాంటి బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నరు. హీరోలెక్క ఫైట్ చేస్తూ ప్రజలను కాపాడుకునేందుకు పోరాడుతోంది బీజేపీ. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరనే విషయాన్ని ప్రజలకు కూడా అర్థమైందన్నారు.

అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, ఉద్యోగాల భర్తీ, రైతులకు బీమా
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేద, మధ్య తరగతి విద్యార్ధి ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడేలా చదివిస్తాం. బకాయిల్లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ ను సక్రమంగా చెల్లిస్తూ అటు చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలను ఆదుకుంటామన్నారు. ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రేవేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్ది కార్పొరేట్ దోపిడీని అడ్డుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి వాడికి హెల్త్ కార్డు అందిస్తామని, ఏ జబ్బు చేసినా ఉచితంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌తో పాటు ఏటా ప్రభుత్వ శాఖల్లో 3 శాతం ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. వాటిని ముందుగానే గుర్తించి భర్తీ చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుకు బీమా పథకాన్ని అమలు చేసి నష్టపరిహారం అందిస్తాం. సన్న, చిన్న కారు రైతులతోపాటు కౌలు రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు అందిస్తాం. రైతును రాజుని చేసి సగర్వంగా గల్లె ఎత్తుకునేలా చేస్తామని చెప్పారు.

తెలంగాణకు విముక్తి కల్పిద్దాం
‘ఈ 10 ఏళ్ల తెలంగాణలో సాధించిన విజయాలపై బీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల పండుగ చేసుకుంటుంది. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు? కేసీఆర్ పాలనలో సాధించిందేమిటి? అవినీతి, ఆక్రందనలు, అర్తనాదాలు, హత్యలు, అత్యాచారాలు తప్ప. తెలంగాణ అంటే 4 కోట్ల మంది ప్రజలనే సోయిని మర్చిపోయిండు కేసీఆర్.. ఆయన కుటుంబంలోని నలుగురి కోసమే తెలంగాణ వచ్చినట్లుగా పాలిస్తున్నడు.

తెలంగాణ లో కోటి కుటుంబాలున్నాయనే సోయి మర్చిపోయిండు. ఒకే కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందనుకుంటున్నడు. చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు. ఆయన సాధించిన పురోగతి ఏమైనా ఉందంటే… లీకులు- లిక్కర్-అప్పుల్లోనే పురోగతి సాధించిండు’ అని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here