Teenmar Mallanna: అన్నీ ఆయనే చేస్తే.. ప్రభుత్వమేం చేస్తోంది?

0
60

– విద్యార్థులకు అండగా తీన్మార్ మల్లన్న
విద్యార్థులకు నోట్‌ బుక్‌ల నుంచి మొదలుకొని ల్యాప్‌టాప్‌లు, ఉన్నత విద్యకోసం ఆర్థికసాయమంతా తీన్మార్‌ మల్లన్ననే చేస్తే ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లకు విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు వచ్చేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోజులు గడిచినా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందడం లేదు. దీంతో పేద విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఇచ్చిన కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా విస్మరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పేదలు అరకొర వసతుల నడుమే చదువులు కొనసా….గించాల్సి వస్తోంది. ఇటీవల మేడ్చల్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందిస్తున్న తీన్మార్‌ మల్లన్నను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా డీఈఓనే ‘ఎవరినీ పాఠశాలల్లోకి రానివ్వొద్దని, మనమేమైనా బిచ్చం అడుకుంటున్నామా? ముందు వెనుక మనం అన్నీ ఇస్తున్నాం కదా? మళ్లీ ఇలాంటివి జరిగితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ ఒక సర్క్యూలర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుకాల ఓ మంత్రి ఉన్నారని మల్లన్న ఆరోపిస్తూ, తమను స్కూళ్లల్లో పుస్తకాలు పంచనీయకపోతే ఇంటికెళ్లి అయినా పంచుతామని మల్లన్న స్పష్టం చేశారు. పేదలకు చదువు అందించడమే తమ కర్తవ్యమని, అందుకు ఎంతవరకైనా వెళ్తామని తెగిన చెప్పిన విషయం తెలిసిందే.
ప్రజలను నమ్మాడు.. ప్రజలు నమ్ముతున్నారు
మల్లన్న గత కొద్దిరోజులుగా చేస్తున్న సాయాన్ని ప్రభుత్వం మొదటినుంచీ రాజకీయంగానే చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట్లో చాలామంది ఆ కోణంలోనే చూశారు. కానీ మల్లన్న సాయం ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి ఉమ్మడి హైదరాబాద్‌ , రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా అందడంతో జనాల్లో మల్లన్న హీరోగా మారాడు. అవును.. ఎవరైనా తమ వద్ద ఏం ఆశించకుండా సాయం చేసేవారిని ఆ భగవంతుడితో సమానంగా చూడడం పరిపాటి. నిజంగా మల్లన్న రాజకీయమే చేస్తే ఉప్పల్‌ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఏమైనా చేయాలి. రాష్ట్రమంతటా అతడికి చేయాల్సిన అవసరమేంటి? ఇంత సాయం చేస్తున్న మల్లన్న ఏమైనా కోట్లకు పడగలెత్తినోడా అంటే అదీ కాదు. అతడు ప్రజల్ని నమ్మాడు.. ప్రజలు అతడిని నమ్ముతున్నారంతే. ఇటీవలి కాలంలో మల్లన్న చేస్తున్న సాయంపై కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు మొదటి నుంచీ ఉన్నా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎవరికీ సాయం అందకూడదని భారీ కుట్రలకు తెర లేపుతున్నట్లు తెలుస్తోంది.
మల్లన్నను జీరో చేయండి
మల్లన్న సాయాన్ని కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ఎలాగైనా మల్లన్నను జీరో చేయాలి. దానికి ఏం చేయాలనే ఆలోచనలో ఏవేవో చేస్తున్నారు తప్పా అసలు తమను నమ్ముకున్న ప్రజలకు ఏదైనా చేద్దాం అనే ఆలోచననే పూర్తిగా విస్మరించారు. అవును ఏం చేస్తే మల్లన్న జీరో అవుతాడో తానే స్వయంగా చెప్పారు. తను చేసే సాయాన్ని నాయకులు, అధికార యంత్రాంగమే చేస్తే ప్రజలు నావైపు ఎందుకు చూస్తారు? నేను ఈ ‘క్యూ న్యూస్‌’ ఎందుకు నడిపిస్తాను? అంటూ నిత్యం చెబుతూనే ఉంటారు. అవేవీ పట్టించుకోకుండా దేవుడి సాయానికి పూజారి అడ్డన్నట్లుగా మల్లన్న చేస్తున్న ప్రతి సాయానికి అడ్డుతగులుతూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో ఆరోగ్య వంటి మంచి పథకం ఉన్నా పిల్లల తల్లిదండ్రలు మల్లన్నను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నా క్యూ న్యూస్‌ వద్దుకు ఎందుకు వెళ్తున్నారు? అభాగ్యులంతా ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? చివరకు అన్యాయం జరిగినా పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కకుండా మల్లన్న చెంతకు ఎందుకు చేరుతున్నారు?’ ఎందుకుంటే ఇక్కడే వారికి న్యాయం దొరుకుతుందన్న ఆలోచనలో వారున్నారు. మల్లన్న ఏవిధంగానైనా ఆదుకుంటాడనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే ప్రజల్లో మల్లన్నను హీరో చేసింది. నాయకులను జీరో చేసింది. మల్లన్న రాజకీయాల్లోకి రావడమనేది ఆయన వ్యక్తిగతం. ప్రజలు కూడా అలాంటి బలమైన ప్రజానేతలనే కోరుకోవడం సహజం. అది ఎంతమంది నిలువరించే ప్రయత్నం చేసినా మరింత బలంగా ముందుకెళ్లడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here