పలు జిల్లాల్లో 300 మి.మీ వర్షపాతం నమోదు
గుజరాత్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. మంగళవారంనాడు కురిసిన భారీ వర్షాల ప్రభావం బుధవారంనాడు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. రాజ్ కోట్ లో వరద నీరు కాలనీలను ముంచెత్తింది. సూరత్, గిర్ సోమ్ నాథ్ జిల్లాలు 300 మి.మీ వర్షపాతాన్ని నమోదు చేసుకున్నాయి. 70మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రోడ్లు జలమయమై వాహనాలు పడవల్లా తేలియాడాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో రానున్న రోజుల్లో మరింత భారీ వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సుత్రపడ తాలుకాలో 345 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారంనాడు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.