బాల వికాసంతోనే ఆరోగ్యకర భవితవ్యం

0
26

– స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా. ఆంజనేయ గౌడ్

బాల వికాసంలోనే రాష్ట్ర, దేశ ఆరోగ్యకర భవితవ్యం మిళితమై ఉందని, సవాళ్లను సునాయాసంగా అధిగమించే శక్తివంతమైన నవతరం సృష్టికి బాల సాహిత్యమే మూలమని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో శనివారం జరిగే బాల వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్మార్ట్ ఫోన్ లే రిసోర్స్ సెంటర్ లుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, సామాజిక మాద్యమాలను బాల సాహిత్య వ్యాప్తికి సాధనంగా వినియోగించే కార్యాచరణను బుద్ధి జీవులు ముందుకు తీసుకొనిపోవాలన్నారు.

నెహ్రూ, బాల ఇందిరాగాంధీల మధ్య ఉత్తరాల్లో నడిచిన సాహిత్య, సామాజిక చర్చ లే దివంగత ప్రధాని ఇందిరా గాంధీని ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొనే నేతగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. ఆత్మహత్యలు లేని ఆనంద సమాజానికి, నూతన ఆవిష్కరణల సృష్టికర్తలుగా నవతరం ఎదగడానికి బాల సాహిత్యం బలమైన బీజమేస్తుందని వివరించారు. తల్లిదండ్రులు బాల సాహిత్యం ఆస్వాదించేలా పిల్లలను ప్రోత్సాహించాలని సూచించారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం పాఠశాలలు, గ్రంథాలయాల్లో బాల సాహిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని విభిన్న రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహించాలని, తద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతుందన్నారు. బాల వికాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు చొక్కాపు వెంకట రమణ, సీఏ ప్రసాద్, వీఆర్ శర్మా, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, సెక్రటరీ ఆర్.వాసు, భూపతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here