టీమ్ బస్సులో కోచ్ జయసింహా మద్యం తాగాడనే ఆరోపణలపై దర్యాప్తు
ప్రజానావ, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మహిళల జట్టు హెడ్ కోచ్ విద్యుత్ జయసింహాని శిక్షణ బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు.
శుక్రవారం వివిధ వాట్సాప్ గ్రూప్‌లు, వార్త చానెళ్లలో ప్రత్యక్షమైన, ప్రసారమైన వీడియోల ఆధారంగా విధుల నుంచి తప్పించినట్టు జగన్‌మోహన్ రావు చెప్పారు. ఈ మేరకు జగన్‌మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జయసింహా టీమ్ బస్సులో మద్యం సేవిస్తున్న వీడియోలు, ఒక ఫిర్యాదు ఈనెల 15న హెచ్‌సీఏకు ఈమెయిల్ ద్వారా అందిందని, దానిపై ఆరా తీస్తుండగానే, మీడియాలో వార్త కథనాలు వచ్చాయన్నారు.
ఇలాంటి తప్పులకు పాల్పడే వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కూడా వెనుకాడామని చెప్పారు. మహిళల జట్టు ఏ టూర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది? మద్యం సేవిస్తే, అసలు బస్సులోకి మద్యం ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? తదితర విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి, సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు.
మహిళల గౌరవం, భద్రతకు భంగం కల్గించిన వారు ఎంతటి పెద్ద స్థాయి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. మహిళా క్రికెటర్లతో తమ సిబ్బంది మాట్లాడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్ రావు చెప్పారు.