– రెండు నియోజవర్గాలలో 4,70,438 మంది ఓటర్లు
– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
ప్రజానావ/సిరిసిల్ల బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు తుది జాబితా ప్రచురించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల లలో కలిపి మొత్తం 4,70,438 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,45,115 మంది, వేములవాడ నియోజకవర్గంలో 2,25,323 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
సాధారణ ఓటర్ల తో పాటు రెండు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 159 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ జాబితాను కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్ కార్యాలయాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితా కాపీని అందజేస్తామని చెప్పారు. జిల్లాలో ఇంకా ఎవరైనా జనవరి 1 ,2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సూచించారు.