కాంగ్రెస్‌లోకి ఈటల?

0
573
file photo

పార్టీ మారబోతున్నారంటూ జోరుగా చర్చ


etela rajendar: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ మళ్లీ పార్టీ మారబోతున్నారా? అవుననే అంటున్నాయి సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు.

ఇటీవలే బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఈటల ఓ ప్రయివేట్‌ కార్యక్రమంలో సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయి.

దీంతో పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆయా పార్టీలో ఈటల కాంగ్రెస్‌ గూటికి చేరతారనే వార్తలు జోరందుకున్నాయి. ఈటల రాజేందర్‌ 2018లో టీఆర్‌ఎస్‌ (ఇప్పటి బీఆర్‌ఎస్‌) నుంచి హుజూరాబాద్‌ అభ్యర్థిగా విజయం సాధించాడు.

అనంతరం మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే పలు వేదికలపై అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన పార్టీ సీరియస్‌ అయింది. ఈ క్రమంలో 2021 మేలో ఈటల భూ ఆక్రమణల ఆరోపణలను ఎదుర్కొన్నారు.

మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట, హసీంపేటల్లో తన కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్‌ను దళితుల భూములను ఆక్రమించడంతో పాటు బెదిరించి లాక్కున్నరనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అధిష్ఠానం ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించింది.

అప్పటికే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దూరంగా ఉంచడంతో ఈటల పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులతో పాటు పార్టీ ప్రముఖులంతా వెళ్లి హుజూరాబాద్‌లో ప్రచారం నిర్వహించినా ఈటలను ఓడించలేకపోయారు.

బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని ఎదురించి విజయం సాధించిన ఈటలకు బీజేపీ అధిష్ఠానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈటల గజ్వేల్‌, హుజూరాబాద్‌ రెండు స్థానాల నుంచి పోటీకి దిగారు.

అయితే అనూహ్యంగా ఈటల రెండు స్థానాల్లో ఓటమి చెందారు. గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయం సాధించగా, హుజూరాబాద్‌లో అదే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పాడి కౌశిక్‌ రెడ్డి ఈటలపై విజయం సాధించారు.

ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్‌కు గూటికి చేరిన పట్నం మహేందర్‌ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో ఈటల రాజేందర్‌ ఓ ప్రయివేట్‌ కార్యక్రమంలో చర్చించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బీజేపీతో ఆయా పార్టీల నేతలు ఈటల రాజేందర్‌ నిజంగానే పార్టీ మారబోతున్నారా అని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌లో చేరితే ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని, ఈ విషయంపై క్లారిటీ వస్తే రేపో, మాపో ఈటల పార్టీ మారతారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇదిలాఉంటే కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఖండించారు. ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశానని, కావాలనే ఆ ఫొటో పెట్టి నాపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here