మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం

0
61

– రాణించిన బ్రూక్‌, క్రాలే
– ఐదు వికెట్లతో చెలరేగిన స్టార్క్‌
Ashes series 3rd Test EngvsAus 2023: లీడ్స్‌: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు బోణీ చేసింది. మూడో టెస్టులో మరో రోజు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 27/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు ఆదిలోనే బెన్‌ డకెట్‌ (23) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మొయిన్‌ అలీ (5), క్రాలే (44) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ నెమ్మదిగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో కమిన్స్‌ వేసిన బంతిని రూట్‌ (21) అనవసరంగా ఆడి కీపర్‌ క్యారీ చేతికి చిక్కాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (13) కూడా స్టార్క్‌ బౌలింగ్‌లోనే కీపర్‌ క్యారీ చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన జానీ బెయిర్‌ స్టో (5) నిరాశ పరిచారు. ఈక్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న హరీ బ్రూక్‌ (75) ధాటిగా ఆడే క్రమంలో స్టార్క్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి క్రీజును వదిలాడు.
అనంతరం క్రిస్‌ వోక్స్‌ (32 నాటౌట్‌), మార్క్‌ వుడ్‌ (16, నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు.

ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ మార్ష్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మార్క్‌వుడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్‌ సీరిస్‌లో ఇంగ్లాండ్‌ 1-2 తేడాలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here