దేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ మోడీ రావాలి
బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
ఎల్బీనగర్, ఢిఫెన్స్ కాలనీల్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
మల్కాజ్‌గిరి, ప్రజానావ: దేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ మోడీ రావాలని, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనేది ప్రస్తుతం ప్రజల నినాదమన్నారు బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.
బుధవారం ఆయన ఎల్బీనగర్, ఢిఫెన్స్ కాలనీల్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నానని, ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు.
ఎన్నికల్లో రెండోసారి గెలుపొందడమంటేనే మామూలు విషయం కాదని, అలాంటిది మూడోసారి ఎన్నికల్లో గెలుపొందడం అద్భుతమనే చెప్పాలి.
నేడు యావత్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆయన మాట ఒక మెసేజ్
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన ప్రతి మాట ఒక మెసేజ్ వంటిందని ఈటల అన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికే విశ్వగురు స్థానంలో నిలబెట్టిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు.
యోగాని ప్రపంచానికి పరిచయం చేసి, అంతర్జాతీయ యోగాడేను ప్రపంచమంతా పాటించేలా చేశారని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేవాడే నిజమైన పాలకుడు అనేది ప్రధాని భావన అన్నారు. దేశ సంస్కృతిని కాపాడడం కూడా పాలకుని విధి అని, గతంలో పాలకుల అఘాయిత్యాల వల్ల భారతీయ ప్రముఖ దేవాలయాలు ఎన్నో దోపిడీకి గురయ్యాయన్నారు.
అలాంటి దేవాలయాలన్నింటినీ మోడీ పునరుద్ధరించారని గుర్తుచేశారు. ‘ప్రతీ ఊరికీ గుడి ఉండాలని ప్రజలు కోరుకుంటారు. మన పురాణాల్లో ప్రముఖ ఇతిహాసమైన రామాయణానికి గౌరవమిచ్చి, అయోధ్య రామాలయాన్ని తిరిగి నిలబెట్టి ప్రజల మనస్సులు చూరగొన్నారు.
ఇతర మతాల వారితో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా, దశాబ్దాల తరబడి హిందువులు కోరుకుంటున్న మందిర నిర్మాణం జరిగేలా చేశారు’ అని ప్రధాని మోడీ సేవలను ఈటల కొనియాడారు.