సింగరేణి పీఆర్వోకు జర్నలిజంలో డాక్టరేట్

0
23

– అభినందనలు తెలిపిన సీపీఆర్వో ఎం.సురేశ్‌

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి శ్రీరాముల శ్రీకాంత్ కు నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. ‘రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ మూమెంట్స్- ఏ కేస్‌ స్టడీ ఆఫ్ తెలంగాణ మూమెంట్’ అన్న అంశంపై ఇఫ్లూ అసోసియేట్ ప్రొ. డా. రాజారాం పర్యవేక్షణలో శ్రీకాంత్ పరిశోధన చేశారు. సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో సోషల్ మీడియా బలమైన పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలోనూ సోషల్ మీడియా పాత్ర ఎక్కువగా ఉందన్న విషయాన్ని తన పరిశోధన పత్రంలో సమర్పించారు.

ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఉస్మానియాకు చెందిన అసిస్టెంట్ ప్రొ. డా. టి.సతీష్ వైవా వాయిస్ నిర్వహించి డాక్టరేట్ ప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లా కాపువాడకు చెందిన రిటైర్డ్‌ బీఎస్ఎన్ఎల్ అధికారి శ్రీరాముల మల్లేషం- దేవికల కుమారుడైన శ్రీకాంత్ ఉన్నత చదువులు చదివారు. ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్స్), ఎంబీఏ, ఎంసీజే, ఎంఎస్ డబ్ల్యూ పూర్తి చేశారు. యూజీసీ నెట్ లెక్చర్షిప్ నకు అర్హత సాధించారు. ఆయన ప్రముఖ పత్రికలో ఏడేళ్ల పాటు సబ్ ఎడిటర్‌గా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ లో జూనియర్ గ్రేడ్ ఐఐఎస్ అధికారిగా మూడేళ్ల పాటు సేవలందించారు.

గత ఎనిమిదేళ్లుగా సింగరేణి కాలరీస్ లో వెల్ఫేర్ ఆఫీసర్‌గా, పర్సనల్ అధికారిగా, ప్రస్తుతం హైదరాబాద్ లో కంపెనీ ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీకాంత్ కు జర్నలిజంలో డాక్టరేట్ ప్రకటించడంపై జీఎం (కో ఆర్డినేషన్), చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఎం.సురేశ్‌ అభినందనలు తెలిపారు. సింగరేణిలో ప్రజా సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు తన పరిశోధన అనుభవాన్ని ఉపయోగించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here