న్యూఢిల్లీ: యూపీఏ పదేళ్ల పాలనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘శ్వేతపత్రం’కు ప్రతిస్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై ‘బ్లాక్ పేపర్’ ను కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ బ్లాక్ పేపర్ ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలిగిన సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, ప్రస్తుత ప్రభుత్వం ఎలా పుంజుకుందో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ, లోక్ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2024 మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ ప్రవేశపెడుతుందని చెప్పారు. అప్పటి సంక్షోభాన్ని అధిగమించామని, సర్వతోముఖాభివద్ధితో ఆర్థిక వ్యవస్థను అధిక సుస్థిర వద్ధి పథంలో బలంగా ఉంచామని ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2014 వరకు మనం ఎక్కడ ఉన్నామో, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడడం సముచితమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశ పెడుతుందన్నారు.
2014లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను పోల్చి శ్వేతపత్రం విడుదల చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.