అయోమయంగా కాంగ్రెస్‌ 60 రోజుల పాలన

0
27

– రాజకీయ దురుద్దేశంతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది
– 420 హామీలకు అమలుకు రూ.57 వేల కోట్ల బడ్జెటే
– రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారు?
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు రూ.57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందన్నారు.

మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే రూ.50వేల కోట్ల పైన అవుతుందన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడంతో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను చేస్తుందని, వీటిని ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం బీఆర్‌ఎస్‌ నేతలు నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. గత పదేళ్లలో ప్రతిరోజూ పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.

ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండా, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని విమర్శించారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జీహెచ్ఎంసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని, జీహెచ్ఎంసీ పాలక మండలితో పాటు కార్పొరేటర్లు తమకున్న అధికారులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here