రేపు కరీంనగర్‌కు కేసీఆర్

0
1

– పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్న ముఖ్యమంత్రి
– సిఎం పర్యటన ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు
బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామడుగు మండలంలో జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నష్టం వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. జిల్లాలో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. వడగళ్ల వానకు ఆయా రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. దాదాపు 18,000 మంది బాధిత రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here