ఆరు గ్యారెంటీలు అందరికీ కాదా?

0
62

ఎన్నికలప్పడు అలా అని.. ఇప్పుడు కొందరికే అంటారా?
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే ఇచ్చింది.. కానీ అందులో 13 హామీలున్నాయి
బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్


ప్రజానావ, హైదరాబాద్‌ బ్యూరో: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు మాత్రమే ఇచ్చామని చెబుతున్నా.. అందులో 13 హామీలున్నాయని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్ కుమార్‌ అన్నారు.

శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 27న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారని, ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గతం లో చెప్పారని, రేవంత్ రెడ్డి తీరు

ఇపుడు అలానే ఉంది ఇది దుర్మార్గమన్నారు. రూ. 500 కు సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అన్నారు. రాష్ట్రంలో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం 40 లక్షల మందికే ఉచిత రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామనడం అన్యాయమన్నారు. ప్రజా పాలన కింద ఎంత మంది రూ.500 కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదని మండిపడ్డారు.

తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఈ పథకం వర్తిస్తుంది అంటున్నారని పేర్కొన్నారు.

ఎన్నికలప్పడు అందరికీ ఇస్తామని, ఇపుడే కొందరికే ఇస్తామంటున్నారని విమర్శించారు. ఇక సంవత్సరానికి 3 నుంచి 5 సీలిండర్లు ఇస్తామంటున్నారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలి


ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలిచ్చిన కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా శ్రవణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

గ్యాస్ కనెక్షన్ లు ఉన్న వారందరికీ పథకం వర్తింప జేయాలన్నారు. .ముందు డబ్బులు వినియోగదారుడు కట్టాలి తర్వాత సబ్సిడీ ఇస్తామనేది సరికాదన్నారు.

రాష్ట్రంలో కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కోటి ఐదు లక్షల మంది 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారన్నారు.

అందరికీ 200 యూనిట్ల లోపు వాడే విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలని, డొంక తిరుగుడు నిబంధనలు పెట్టడం సరికాదన్నారు.

సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం అబద్ధాలు


’60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారు. సమ్మక్క సారక్క సాక్షిగా ముఖ్యమంత్రి నయవంచనకు పాల్పడ్డారు.’

అయిపోయిన పెళ్లికి బాజా కొట్టినట్టు ఉంది సీఎం రేవంత్ తీరని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లు రేవంత్ తనవిగా ఎలా చెప్పుకుంటారని దాసోజు ప్రశ్నించారు?

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ హయంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎలా కలుపుతారన్నారు? అమ్మ వారి సాక్షిగా అబద్ధాలాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని సీఎం రేవంత్ అంటున్నారని, బీఆర్‌ఎస్‌ హయాంలో కను రెప్ప కొట్టుకునే సమయం కూడా కరెంటు పోలేదన్నారు.

రేవంత్ రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయి? రేవంత్ తన చేతకాని తనాన్ని అసమర్ధతను చిన్న ఉద్యోగుల పై ఫత్వాలు జారీ చేస్తున్నారని, రేవంత్ కు పాలన చేతకావడం లేదని ప్రజలు గ్రహించాలన్నారు.

సంబంధిత శాఖ మంత్రి భట్టియేనని, కరెంటు పోయినందుకు ఆయన్ను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. రైతు బంధు పై ఇప్పటి దాకా మీన మేషాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు.

ఇప్పటిదాకా 30మంది ఆటోడ్రైవర్లు చనిపోయారని, వారి సంక్షేమం కోసం మేనిఫెస్టో లో పెట్టిన అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

రైతుల పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారు..అది కూడా లేదని విమర్శించారు. హడావుడిగా హామీలు ఇచ్చినంత శ్రద్ధ వాటి అమలు పై లేదని, మేం రేవంత్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here