- ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ కొత్త హామీలతో మోసమా?
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలే
- రైతుల దుస్థితికి కారణం ముమ్మాటికీ ఆ రెండు పార్టీలే…
- కేసీఆర్ పాలనలో 11 వేల మంది చనిపోతే ఎందుకు స్పందించలేదు?
- 30 లక్షల ఎకరాల పంట నష్టమైతే ఎందుకు ఆదుకోలేదు?
- ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు
- నా ఫోన్ ను కూడా గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది
- కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాల్సిందే
- ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరి
- దమ్ముంటే.. ప్రధాని అభ్యర్ధి ఎవరో కాంగ్రెస్ ప్రకటించాలి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
- నేతన్నలకు మద్దతుగా ఈనెల 10న సిరిసిల్లలో ’దీక్ష‘ చేస్తున్నట్లు ప్రకటన
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్. ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణం. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్.. సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలే. రైతులు, నేతన్నల దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణం. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో ‘దీక్ష’ చేస్తున్నా. నయీం ఆస్తులపై విచారణ జరపడంతోపాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాల్సిందే.’
1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని స్థాపించారు.
2 సీట్లతో మొదలైన ప్రస్తానం మోడీ, నడ్డా నాయకత్వంలో 400 సీట్ల దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
శనివారం ఆయన కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2 సీట్లతో ఏం సాధిస్తారని వెక్కిరించిన పార్టీలే బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దిశగా పతనమవుతోందని విమర్శించారు.
చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందించాలనే పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ సిద్దాంతాలను అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ అన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించారని, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాఖ్ రద్దు.. సీఏఏ బిల్లు ఆమోదం వంటి విప్తవాత్మక చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.
25 కోట్ల మంది పేదలకు విముక్తి
మోడీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 4 కోట్ల ఇండ్ల నిర్మాణం, 11 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు, 20 కోట్లకుపైగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్, కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి అనేక పథకాల ద్వారా సంక్షేమం అందుతోంది.
కరోనా వ్యాక్సిన్ దేశంతో పాటు ప్రపంచానికి అందించి కాపాడిన ఘనత మోడీదేనన్నారు. 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చారు.
మరో మూడేళ్లలో 3వ స్థానానికి, 2047 నాటికి నెంబర్ వన్ గా చేసి భారత్ ను విశ్వగురు తీర్చిదిద్దేందుకు మోదీగారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా ఎండిపోయిన పంటలను సందర్శించడం చాలా సంతోషమని,. ఇప్పటికైనా ఆయనకు బుద్ధి వచ్చినట్లుందన్నారు.
రైతుల కష్టాలు తెలిసినట్లున్నయ్. ఆయన ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ తన భాషను స్టార్ట్ చేసిండని, తెలంగాణ ఇయాళ అథోగతి పాలుకావడానికి ఆ భాషే కారణమన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి లబ్ధి పొందాలని చూస్తున్నడని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులెందుకు గుర్తుకు రాలేదని, 10 ఏళ్ల పాలనలో 30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే ఏ ఒక్క రైతును ఆదుకోలేదన్నారు.
11 లక్షల మందికి పైగా రైతులు చచ్చిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదని, రూ.లక్ష రుణమాఫీ అమలు చేస్తానని మాటతప్పారని గుర్తుచేశారు. కే
సీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రి వడగండ్ల వానలతో రామడుగు మండలం లక్ష్మీపూర్ వచ్చి ఎకరాకు రూ.10 వేలు విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతుల చావులకు, నష్టాలకు ముమ్మాటికీ కారకుడు కేసీఆరేనని, ఇటీవల కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే మనిషిని చంపేసి… అయ్యో పాపం అంటూ ఆ మనిషి ఫొటోకు దండం పెట్టి దండేసినట్లుందన్నారు.
‘ఇగ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. అది ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకుండానే చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలిస్తాం. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలిస్తాం. వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తం. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లన్నీ మేమే కొంటం. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తం… రైతు కమిషన్ ను ఏర్పాటు చేస్తాం’అని హామీలిచ్చారు కదా? ఎందుకు అమలు చేయలేదు? ఆసరా పెన్షన్ ను 4 వేలకు పెంచుతామన్నరు. మహిళలకు నెలనెలా రూ.2500లు ఇస్తామన్నరు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నరు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నరు.. మరి ఎందుకు వాటిని అమలు చేయలేదో సమాధానం చెప్పాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోదు. కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదు.
అందుకు ప్రతిఫలంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీయదు. రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నయ్.
ఇది ప్రజలు గమనించాలి. వాళ్లకు చిత్తుశుద్ధి ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలి. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అందరికీ తెలుసు. దమ్ముంటే నయీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
ఈ వ్యవహారంపై సిట్ విచారణను కొనసాగించాలి. డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ జరపాలి. వీటిపై విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజలను దారి మళ్లిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలేది చెబుతున్నారు.. కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఉందంటున్నారు కదా… మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదు?
అంతెందుకు నా ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారు. అందుకే ఆనాడు నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పిన. ఫోన్ లో మాట్లాడుకునే అంతర్గత విషయాలను ట్యాప్ చేశారు. పార్టీ కోర్ కమిటీలో చర్చించిన విషయాలను కూడా ట్యాప్ చేశారు..
బీఆర్ఎస్ లాంటి చిల్లర పార్టీ ఇంకోటి లేదు.. అందుకే ఈ వ్యవహారంపై బీజేపీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది… కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ తో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే.. ట్యాపింగ్ చేసిన అధికారులు దానిని ఆసరాగా చేసుకుని ట్యాపింగ్ ద్వారా బెదిరించి డబ్బులు దండుకున్నరు.
ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి దుర్మార్గులు. మా పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయడంతోపాటు కార్యకర్తలను రాచిరంపాన పెట్టారు. అట్లాంటోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే… వాళ్ల సంగతి చూస్తాం.
నేత కార్మికుడి ఆత్మహత్య బాధాకరం
‘సిరిసిల్లలో నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేక ఆత్మహ్యత చేసుకోవడం బాధాకరం. ఈ దుస్థితికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే. ఈ రెండు పార్టీల విధానాలే కారణం.
అందుకే రాష్ట్రంలోని నేతన్నలకు మద్దతుగా ఈనెల 10న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేబోతున్నం.
నేతన్నలను ఆదుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
అంతకుముందు బండి సంజయ్ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని వారి ఇంటివద్ద, పోలింగ్ బూత్ నెం. 174లో పార్టీ జెండాను ఎగురవేశారు.