లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్‌

0
33

16 ఎంపీ సెగ్మెంట్లలో నేటి నుంచి విజయ సంకల్ప రథయాత్ర
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు

ప్రజానావ, హైదరాబాద్‌ బ్యూరో: భారతీయ జనతా పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో జనంలో వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

మొదటినుంచి హిందూ ఓటు బ్యాంకు దృష్టిలో ఉంచుకొని మంగళవారం నుంచి 16 ఎంపీ సెగ్మెంట్లలో విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం చుట్టింది.

ఈమేరకు సోమవారం కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రచార వాహనాలకు పూజలు చేశారు.

మొత్తం 16 ఎంపీ సెగ్మెంట్లలో 5 క్లస్టర్లుగా సాగే రథయాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.

ఇప్పటికే బీజేపీ అధిష్టానం మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఎన్డీఏ 400 సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ఈ ప్రచార రథాల ద్వారా రాష్ట్ర బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మార్చి 1వరకు కొనసాగించనుంది. 5 క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్‌ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు ఉండనున్నాయి.

ఈ ఐదు క్లస్టర్లకు తెలంగాణలోని చారిత్ర ప్రదేశాల పేర్లు పెట్టారు.

1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర..
బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు జరుగుతుంది. 21 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.

2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర
కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది.

మిగిలిన నియోజకవర్గాలను కూడా కవర్ చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం.

3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో ఈ యాత్ర సాగుతుంది.

4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర
సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది.

వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 1,015 కి.మీ,7 రోజులు.. 21 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర
మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.

17 సీట్లే లక్ష్యంగా..


రాష్ట్రంలో బీజేపీకి 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ప్రస్తుతం ఎక్కువ మద్దతు ఉంది. తెలంగాణలో 17కు 17సీట్లు గెలవడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెజారిటీ స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు అనేది మూర్ఖులు చేస్తున్న ప్రచారామని, 17 సీట్లలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీతో ఏరోజు కూడా పొత్తు పెట్టుకోలేదన్నారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ ఇలానే ప్రచారం చేశారని, ఇలాంటి దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు.

బీజేపీ దమ్ము, ధైర్యం కలిగిన పార్టీ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరవెనుక కలిసే పార్టీలని విమర్శించారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయని గుర్తుచేశారు.

గ్రామస్థాయిలో, పోలింగ్ బూత్ లో 25 మందిని పార్టీలో చేర్చుకుంటామని, విజయ సంకల్ప యాత్రలో బూత్‌ల్లో, గ్రామాల్లోని రైతులు, మహిళలు, కుల సంఘాల నాయకులను, యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు.

2018 ఎన్నికల్లో అనేక స్థానాల్లో మా ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు రాలే. ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు.

నేడు నారాయణపేట యాత్రలో పాల్గొననున్న కిషన్ రెడ్డి
బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం నారాయణపేట జిల్లాలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.

ఉదయం 9గంటలకు నారాయణ పేట జిల్లా కృష్ణ నదిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కృష్ణ గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తారు.

ఉదయం10 గంటలకు మాగునుర్ మండలం మీదుగా మక్తల్ టౌన్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.

అక్కడి నుంచి బయల్దేరి ఉట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సింగారం గేట్ మీదుగా రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు.

అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖీలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి నారాయణ పేటలోనే బస చేస్తారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here