నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ఇటీవల ముగ్గురు విద్యార్థినులు ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడంతో పాటు విద్యార్థినులు భరోసా ఇద్దామని సోమవారం ట్రిపుల్ ఐటీ కాలేజ్ వద్దకు వెళ్లిన బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ని, ఇతర బీజేపి నాయకులను పోలీసులు అడ్డుకొని, బలవంతంగా అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ లో బీజేపి నేతలు, పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినులకు భరోసా కల్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.
గత కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలోనూ కాలేజీలో ఆత్మహత్యలు జరిగాయని, విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం లేదనే ఆరోపణలున్నాయని బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు తెలుసుకొని, వారికి అన్నిరకాల వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.