అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోంది

0
54

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌
అసెంబ్లీ ఇరిగేషన్‌పై శ్వేతపత్రం


మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోందని, నీటిని నిల్వ చేయని విధంగా దెబ్బతింటోందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తూ ఈ విషయం చెప్పారు.

ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగపడదని నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పిందని, అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదే విధంగా లీకేజీలు మొదలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి ప్లానింగ్, డిజైన్ల లోపంతో పాటు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమేనన్నారు. సరైన పద్ధతిలో మెయింటెనెన్స్‌ లేకపోవడమూ కారణేమనన్నారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను కూడా నిర్మించారని గుర్తుచేశారు.

మేడిగడ్డ వైఫల్యాలకు కారణాలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధ్యాయనం (ఎన్‌డీఎస్‌ఏ) చేసి 2023 నవంబర్ 21న వెల్లడించిన విషయాలను ఆయన సభ ముందుంచారు.

రాఫ్ట్‌ కుంగిపోవడం.. పియర్స్‌ కదలడంతోనే..
వైఫల్యానికి ప్రధాన కారణం మేడిగడ్డ బ్యారేజ్ లో రాఫ్ట్ కుంగిపోవడంతో పాటు పియర్స్ కదిలి, కుంగిపోయాయి. తద్వారా మొత్తం బ్యారేజ్ కి పగుళ్లు వచ్చి పెద్ద పెద్ద బొరియలు, రంధ్రాలు ఏర్పడ్డాయి.

పియర్స్ కింద ఉన్న ఇసుక కదలడం, ఫౌండేషన్ మెటీరియల్ కు తగినంత బేరింగ్ సామర్థ్యం లేకపోవడవల్ల బ్యారేజ్ బరువు తట్టుకోలేని విధంగా కుంగిపోయిందని ఎన్‌డీఎస్‌ఏ వెల్లడించిందన్నారు. పైల్స్ నిర్మాణంలో కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేశారు. రాఫ్ట్, కటాఫ్ ట్రెంచ్ ల మధ్య ఫ్లింత్ కనెక్షన్‌లో నిర్మాణ లోపం ఉందని తేల్చింది. తద్వారా నీటి ప్రవాహానికి అడ్డం ఏర్పడి మొత్తం బ్యారేజ్ దెబ్బతినింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్, డిజైనింగ్ చాలా ముఖ్యమైనవి.

ఇందులో లోపాలు అధికంగా ఉన్నాయి. మొదట ఆనకట్టను నీటిపై తేలియాడే విధంగా రూపొందించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత ఆనకట్ట ఆప్రాన్ (దిగువ భాగం) ప్రాంతాన్ని పరిశీలించి లోపాలు, నాణ్యత లోపించాయా అనే విషయాన్ని గుర్తించేందుకు తనిఖీ చేయాలి.

ఆ తర్వాత నిర్వాహణ మరమ్మత్తులు చేపట్టాలి. 2019`20 లో ఆనకట్ట పూర్తయినప్పటి నుంచి ఎటువంటి తనఖీలు నిర్వహించలేదు. ఈ విధమైన లోపం వల్ల ఆనకట్ట బలహీనపడింది. తద్వారా మొత్తం వైఫల్యానికి దారితీసింది.

నీటిని నిల్వ చేయకూడదు
మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక బ్యారేజ్లో ఏర్పడిన లోపం మొత్తం బ్యారేజ్ పనితీరుకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ ను పూర్తిగా పునరుద్ధరించే వరకు పనికి రాదని, నీటిని నిల్వ చేయకూడదని నేషనల్ డ్యాం సేఫ్టీ తేల్చి చెప్పింది. దెబ్బతిన్న బ్లాకులను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈలోగా ఇతర బ్లాకులకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు.

ఇందువల్ల మొత్తం బ్యారేజ్ ను పునర్నిర్మించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజ్‌ని నీటితో నింపడం వల్ల మరింత నష్టం వాటిల్లి బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదు.

పైన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కూడా ఇదే విధమైన నమునాలతో (డిజైన్లు) నిర్మించారు. ఇవి కూడా కుంగిపోయే అవకాశం ఉంది. అన్నారం బ్యారేజ్ దిగువన ఇటువంటి సంకేతాలు ఇప్పటికే చూశామని ఎన్‌డీఎస్‌ఏ తేల్చి చెప్పింది.

ఇక రాష్ర్ట ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమిక అధ్యయనంలో వెలుగు చేసిన అంశాలను మంత్రి సభ ముందుంచారు.

ప్రాజెక్ట్ డిజైన్లు, డ్రాయింగ్లు, జియాలజీకల్ పరిశోధనలు నిర్మాణంలో, పాటించిన నాణ్యత ప్రమాణాలు సమగ్రంగా పరిశీలించడం కోసం, బ్యారేజ్ వైఫల్యానికి గల కారణానికి గుర్తించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here