భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా తాగునీటికి సమస్యను రానివ్వొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి అధ్యక్షతన ఆదివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు.
అవసరమైతే అయితే రెండు, మూడ్రోజుల్లో మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు.
వచ్చే ఖరీప్ నాటికి జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న చెరువులు, కుంటలు మరమ్మతులు చేసి రైతులకు సాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం , బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, పాండవులగుట్ట ప్రాంతాలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయిస్తానని తెలిపారు.
అలాగే బాగిర్థిపేట క్రాస్ రోడ్డు నుంచి కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం వరకు ఉన్న సింగిల్ రోడ్డును రూ.25 కోట్లతో డబుల్ రోడ్డు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
రోడ్డుకు అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, ట్రైయినీ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లాలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.