– పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి నిర్మాణ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. తొలుత సచివాలయానికి చేరుకున్న సీఎం ఎలివేషన్ పనులు, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణంతో పాటు స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీఎం చాంబర్ వుండే ఆరో అంతస్తుకు చేరుకొని, ఫర్నీచర్‌తో పాటు గత పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్ ను తిలకించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయం నుంచి నిర్మాణంలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్లతో పాటు ఆడిటోరియం పనులు, ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ పనుల పురోగతిని మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్క్ ఏజెన్సీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక అక్కడినుంచే తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ;మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకి ఇంజనీర్లు వివరించారు. ముఖ్యమంత్రి వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విప్ బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, అధికారులున్నారు.